ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునందరెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని సర్దార్‌నగర్‌ గ్రామ సమీపంలో అమృతరాజు వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న ఆయిల్‌పామ్‌ సాగు యాజమాన్య పద్దతులు, ఉపాధిహామీ పథకంలో భాగంగా పండ్ల తోటల పెంపకం, రాయితీ వివరాల గురించి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ.. ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్‌పామ్‌ మొక్కలకు ఎకరానికి రూ.1,160 డీడీ రూపంలో చెల్లించినచో.. ఎకరానికి 57 మొక్కలు సదరు ఆయిల్‌ కంపెనీ ద్వారా రైతులకు అందజేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం, బీసీ, ఓసీ రైతులకు 90శాతం రాయితీపై డ్రిప్‌ ఇరిగేషన్‌ కింద తగిన మెటీరియల్‌ అందజేస్తామన్నారు. 5 రోజుల పాటు ప్రభుత్వం తరఫున పంటల అధ్యయనానికి ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లామని, అక్కడి అనుభవాలను సాంకేతిక పద్దతులను రైతులకు వివరించారు. కొత్తగా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులందరూ మట్టి పరీక్షలు(సాయిల్‌ టెస్ట్‌) చేయించుకోవాలన్నారు. మట్టి పరీక్షలు ఎలా చేయాలో కిట్టు ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఏడీహెచ్‌ సంజయ్‌కుమార్‌, ఆయిల్‌ కంపెనీ ప్రతినిధులు రఘువర్మ, రామకృష్ణ, రత్నాకర్‌, హెచ్‌వో అశోక్‌, ఫీల్డ్‌ ఆఫీసర్లు ప్రమోద్‌కుమార్‌, శ్రీకాంత్‌, రాఘవేందర్‌, రుక్మిణి, రైతులు పాల్గొన్నారు.

Recommended Posts