రైతులకు బాగు.. ఆయిల్‌పామ్‌ సాగు!

తక్కువ పెట్టుబడితో అధిక లాభం

పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

జిల్లాలో 5,500 ఎకరాల్లో సాగు లక్ష్యం

భారీ రాయితీతో డ్రిప్పు పరికరాల అందజేత

సబ్సిడీపై మొక్కలు, ఎరువుల పంపిణీ

రైతులకు సంప్రదాయ పంటలతో పెద్దగా ఆర్థిక లబ్ధి చేకూరడం లేదు.

దీంతో మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతులకు అందజేస్తోంది. ఆయిల్‌ పామ్‌ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీలు ఇస్తున్నాయి. మొక్కల అందజేత నుంచి ఎరువులు, డ్రిప్పు పరికరాలు, అంతర పంటల సాగు తదితర వాటికి ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర వర్గాల రైతులకు 80శాతం చొప్పున రాయితీ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. నాటిన ఐదో ఏట నుంచి 25ఏళ్ల వరకూ రైతులకు ఆయిల్‌ పామ్‌ తోటల ఫలసాయం అందుతుంది!

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జూలై 25): దేశంలో వంట నూనెల వినియోగం ఎక్కువ. ఇందుకు విదేశాల నుంచి పామాయిల్‌ గింజలను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులను ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయిల్‌ పామ్‌ సాగుతో విదేశాలకు ఎగుమతి చేసి మలేషియా, ఇండోనేషియా దేశాలు ఆర్థిక అభివృద్ధి సాధించాయి. అదే విధంగా తెలంగాణ రైతులు కూడా లాభపడాలని సీఎం కేసీఆర్‌ అయిల్‌ పామ్‌సాగును ప్రొత్సహిస్తున్నారు.ఈ ఏడాది 1.93లక్షల ఎకరాల్లో రంగారెడ్డి, మేడ్కల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యంగాపెట్టుకున్నారు.ఈ జిల్లాల్లో పంటకు అనువైన నేలులున్నాయి. ఈ ఐదు జిల్లాల్లో 5 ఆయిల్‌ పామ్‌ కంపెనీల ద్వారా ఆయిల్‌ పామ్‌ విస్తరణ, నర్సరీల నిర్వహణ, గెలల ప్రాసెసింగ్‌కు ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ సారి 5,500 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు ఉద్యానశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీకి రాష్ట్ర ప్రభుత్వం కొంత కలిపి ఇవ్వాలని నిర్ణయి ంచింది. ఆయిల్‌ పామ్‌ సాగుకు కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు కేటాయిస్తున్నాయి. రానున్న పదేళ్లలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయిల్‌ పామ్‌ సాగును ప్రొత్సహిస్తున్నారు.

ఆయిల్‌ పామ్‌ తోటలతో ప్రయోజనాలు

ఆయిల్‌ పాం మొక్కలు నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి కాపు మొదలై 30ఏళ్ల్ల పాటు ఆదాయం పొందవచ్చు. ఈ మొక్కల పెరిగే వరకు మొదటి మూడేళ్లు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఈ తోటకు తెగుళ్లు, చీడపీడల బెడద తక్కువ. తుఫాన్‌, వడగండ్ల వాన, ప్రకృతి వైపరీత్యాలను సైతం ఈ మొక్కలు సమర్థంగా తట్టుకుంటాయి. అలాగే అడవి పందులు, దొంగల బెడద ఉండదు. రవాణా, మార్కెటింగ్‌, ప్రాసెసి ంగ్‌ సౌకర్యాలు ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారులు కల్పిస్తున్నారు.

నాటిన ఐదేళ్ల తర్వాత దిగుబడి

ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటిన నాటి నుంచి ఐదో సంవత్సరం కల్లా గెలలు వేసి దిగుబడి వస్తుంది. ఒక ఎకరానికి 10-12టన్నుల గెలల దిగుబడి వస్తుంది. సగటున ఒక టన్ను గెలల ధర సుమారు రూ.10వేలు ఉంటుంది. దీని ద్వారా రైతుకు ఒక ఎకరానికి ఏటా రూ.1.25లక్షల చొప్పున ఆదాయం పొందవచ్చు. ఈ విధానంలో 5ఎకరాలున్న రైతు ఏటా రూ.6లక్షల నికరాదాయం పొందుతాడు. 5 ఎకరాలకు 20 సంవత్సరాల కాలంలో రైతులు రూ.1.2కోట్ల ఆదాయం పొందుతారు.

నాటే.. మొక్క వయస్సు

12 నుంచి 14 నెలల వయస్సు ఉండి, 1 నుంచి 1.2 మీటర్లు ఎత్తు, మొదలు 25సెంటీమీటర్ల మందం కలిగి ఉన్న మొక్కలను నాటాలి. మొక్క ఆరోగ్యంగా ఉండి 12 నుంచి 13 ఆకులు కలిగి ఉండాలి. భూమిని బాగా కలియదున్ని, అన్ని రకాలుగా దుక్కి తయారు చేసి ఐదారు రోజులు ఎండిన తరువాతే గుంతలు తీసి మొక్కలు నాటుకోవాలి.

ఆయిల్‌ పామ్‌లో అంతర పంటలు

ఆయిల్‌ పామ్‌లో అంతర పంటలుగా అరటి, బొప్పాయి, జామ, మల్బరి, మొక్కజొన్న, కూరగాయలు, వేరుశనగ, మినుము, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ, మిరప, పత్తి, వేసుకో వచ్చు. ఆయిల్‌పామ్‌ సాగులో మెలకువలు పాటిస్తూ సాగుచేస్తే మంచి దిగుబడి సాధిస్తారు. రైతులు పంటను నేరుగా జిల్లా అనుబంధ ఎంఎస్‌ వాల్యూ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ప్రైవేట్‌ కంపెనీ కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతులకు అందేలా చర్యలు తీసుకోనుంది.

తక్కుత నీటి వినియోగంతో…

ఆయిల్‌ పామ్‌ తోటలకు నీరు బాగానే అవసరం. వేసవిలోనూ నీరందించే బోరు బావుల కింద సాగు చేయడం మేలు. అయితే ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో 3-4ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుచేసుకుకోవచ్చు. ఎకరానికి 50 నుంచి 57 మొక్కలు సమాంతర త్రిభుజాకార పద్ధతిలో నాటుకోవాలి.

సబ్సిడీ కోసం రైతులకు ఉండాల్సిన అర్హతలు

ఆయిల్‌ పామ్‌ తోటలకు అనువైన భూమి, పట్టాదారు పాస్‌పుస్తకం, బోరు/బావి కరెంట్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతీ రైతు ఆయిల్‌ పామ్‌ సబ్సిడీకి అర్హులు. రైతులు ఎన్ని ఎకరాల్లో అయినా ఆయిల్‌ పామ్‌ను సాగు చేసుకోవచ్చు. ఇందుకు రైతులకు అవసరమైనన్ని ఆయిల్‌ పామ్‌ మొక్కలను రాయితీపై ఇస్తారు. కానీ బిందు సేద్య(డ్రిపు) పరికరాలకు మాత్రం గరిష్టంగా 12.5ఎకరాల వరకు మాత్రమే రాయితీ ఉంటుంది.

ఆయిల్‌ పామ్‌ ఎకరానికి రాయితీ ఇలా..

ఎకరం అయిల్‌ పామ్‌ సాగుకు మొక్కలు, డ్రిప్‌, అంతర పంటల సాగు, ఎరువుల యాజమాన్యం కోసం ప్రభుత్వం రూ.50వేల సబ్సిడీ ఇస్తుంది. అయిల్‌ పామ్‌ మొక్కలకు రూ.11,600, బిందు సేద్యం కోసం రూ.22,518 రాయితీ కల్పించనున్నారు. మొదటి నాలుగేళ్ల వరకు ఎకరానికి అంతర పంటలల కోసం రూ.2100, ఆయిల్‌పామ్‌ తోట యాజమాన్యానికి ఎరువులకు రూ.2,100, మొత్తం ఏడాదికి రూ.4,200 చొప్పున రైతుల బ్యాంక్‌ ఖాతాకు ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటిన తర్వాత జమ చేస్తారు.

ఎస్సీ, ఎస్టీలకు పూర్తి రాయితీపై డ్రిప్పు పరికరాలు

ఆయిల్‌ పామ్‌ సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. బీసీలకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీతో ఈ పరికరాలు ఇస్తారు. 5 హెక్టార్ల వరకు డ్రిప్పు రాయితీ ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

సంప్రదించాల్సిన అధికారులు వీరే..

అబ్దుల్లాపూర్‌మెట్టు, హయత్‌నగర్‌, మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం, మాడ్గుల, బాలాపూర్‌, సరూర్‌నగర్‌ మండలాల రైతులు ఉద్యాన శాఖ అధికారి బి.కనకలక్ష్మి 7997725239 అనే నెంబర్‌లో సంప్రదించాలి. చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, షాబాద్‌, శేరిలింగంపల్లి, ఆమనగల్లు, కడ్తాల్‌ రైతులు ఉద్యానశాఖ అధికారి వి.అశోక్‌(9704118520)ను, షాద్‌నగర్‌, కేశంపేట, కొత్తూరు, నందిగామ, చౌదరిగూడెం, కొం దుర్గు, తంలకొండపల్లి రైతులు అధికారి టి.ఉషారాణి (7997725243), మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, గండిపేట రైతులు ఉద్యాన శాఖ అధికారి టీవై.సౌమ్య(9177299489)ను సంప్రదించాలి.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి : సునందారెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి

ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఈ పంట సాగు చేసుకుంటే పంట కాపునకు వచ్చిన తరువాత ఏటా ఆదాయం పొంద వచ్చు. జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగుకు అనువైన నేలలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఆయిల్‌ పామ్‌ దిగుబడితో రైతులు ఎక్కువ ఆర్థిక లబ్ధిపొందవచ్చు. ఆయిల్‌ పామ్‌ సాగు చేసుకు నే రైతులకు ప్రభుత్వం మొ క్కలు, ఎరువులు, డ్రిప్పుపై సబ్సిడీ ఇస్తుంది. ఆసక్తిగల రైతులు వెంటనే ఆయిల్‌ పామ్‌ సాగును చేపట్టాలి.

Recommended Posts